అగ్రవర్ణ పేదల కోటాకు రాజముద్ర

విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగ(103వ సవరణ) చట్టం పేరిట తెచ్చిన ఈ బిల్లు ఇప్పటికే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. ప్రభుత్వం త్వరలో ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. జనరల్‌ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్‌ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక పరిమితుల ఆధారంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ప్రభుత్వం కాలానుగుణంగా గుర్తిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీచేసింది.

ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే..
► వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు
► 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు
► నోటిఫైడ్‌ మునిసిపల్‌ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు
► నాన్‌ నోటిఫైడ్‌ మునిసిపల్‌ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *